: వాజ్ పేయి కోరితే 'భారతరత్న' తిరిగిచ్చేస్తా: అమర్త్యసేన్
మోడీని ప్రధానిగా అంగీకరించలేనంటూ ప్రఖ్యాత ఆర్ధికవేత్త, నోబుల్ విజేత అమర్త్యసేన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోడీపై వ్యాఖ్యలు అనుచితమంటూ, తక్షణమే అమర్త్యసేన్ భారతరత్నను తిరిగిచ్చేయాలని బీజేపీ ఎంపీ చందన్ మిత్రా డిమాండ్ చేయగా.. అటల్ బిహారీ వాజ్ పేయి అడిగితే ఇప్పటికిప్పుడు అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని అమర్త్యసేన్ స్పష్టం చేశారు. భారత్ లో కనీసం ఓటు కూడా లేని వ్యక్తికి ఈ అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడమే గొప్ప అయితే, అతనో పార్టీని, వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోందని చందన్ మిత్రా అన్నారు. ఈ వ్యాఖ్యలపై అమర్త్యసేన్ స్పందించారు.
మిత్రా ఓ విషయం తెలుసుకోవాలంటూ, తనకు భారతరత్న అందించింది వాజ్ పేయి ప్రభుత్వమేనని వెల్లడించారు. వాజ్ పేయి చేతులమీదుగా అవార్డు స్వీకరించానని, ఆయనే అడిగితే తిరిగిచ్చేస్తానని తెలిపారు. ఇక ఈ విషయంలో కేంద్ర మంత్రి మనీష్ తివారీ జోక్యం చేసుకున్నారు. అమర్త్యసేన్ పై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలు ఫాసిస్టు నియంతలను తలపిస్తున్నారని వ్యాఖ్యానించి అగ్నికి ఆజ్యం పోశారు. అమర్త్యేసేన్ ఏం తప్పు చేశారని భారతరత్న వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తారని బీజేపీ నేతలను ప్రశ్నించారు.