: 'నిర్భయ' కేసులో తీర్పు వాయిదా
గతేడాది డిసెంబర్ 16న 'నిర్భయ'పై సామూహిక అత్యాచార పర్వంలో పాలుపంచుకున్న 17 ఏళ్ల నిందితుడిపై ఢిల్లీలోని జువనైల్ బోర్డు తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడిపై బాల నేరస్తుల చట్టం కింద విచారణ ఇప్పటికే పూర్తికాగా, తీర్పు ఈ రోజు వెలువడాల్సి ఉంది. కానీ, తీర్పును ఆగస్ట్ 5 వరకు వాయిదా వేస్తూ జువనైల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 'బాల నేరస్తులు' అన్న పదానికి సరైన నిర్వచనం ఇవ్వాలంటూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషిన్ వేసిన నేపథ్యంలో, నిర్భయ కేసులో తీర్పును వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
బాలుడు అన్న పదంపై తన వాదన వినాలని కోరుతూ జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉంది. దీంతో ప్రత్యేక కోర్టు తీర్పును వాయిదా వేయాల్సి వచ్చింది. బాల నేరస్థుల చట్టం కింద 18 ఏళ్లలోపు వారు కఠిన నేరాలకు పాల్పడినా వారిని కఠినంగా శిక్షించడానికి లేదు. 18 ఏళ్లు నిండాక వారిని విడుదల చేయాల్సి ఉంటుంది. జ్యోతిసింగ్ పై ఇనుప రాడ్లతో దాడి చేసి క్రూరంగా అత్యాచారం చేసిన నిందితులలో ఒకడి వయసు 18 ఏళ్ల కంటే కొన్ని నెలలు తక్కువ. దీంతో అతడు కఠిన దండనల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి క్రూర నేరాల కేసులలో నిందితుల వయసు కాకుండా మానసిక, మేథోపరమైన పరిపక్వత చూడాల్సి ఉందని సుబ్రమణ్యస్వామి తన పిటిషన్ లో కోరారు.