: వివాహ వయసును నిర్ణయించడం కష్టమే: సుప్రీం


అమ్మాయిలకు వివాహ వయసును నిర్ణయించడం కష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలా ఎందుకు వ్యాఖ్యానించిందంటే.. ఎనిమిదేళ్ల క్రితం ఇద్దరు బాలికల(మైనర్లు) కేసులను విచారిస్తూ.. వారు ప్రేమించిన వారిని పెళ్లాడేందుకు అనుమతిస్తూ 2005 అక్టోబర్ 5న ఢిల్లీ హైకోర్టు.. 2006, ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులిచ్చాయి. దీనిపై జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. మైనర్లను వివాహాలకు అనుమతించడం.. బాల్యవివాహాల నిషేధ చట్టం కింద నేరమని పేర్కొంటూ మహిళా కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సందర్భంగానే కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల వివాహ వయసు విషయంలో పలు చట్టాల మధ్య తారతమ్యం ఉందని.. కనుక వారి వివాహానికి సరైన వయసు ఏది? అనే విషయమై ఏకత్వాన్ని తీసుకురావాల్సి ఉందని మహిళా కమిషన్ కోర్టుకు తెలియజేసింది. అయితే, ప్రతీ కేసు విషయంలో ఒకే విధమైన విధానాన్ని నిర్ణయించడం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడింది. ఆ ఇద్దరు మైనర్ల వివాహాలకు అనుమతిస్తూ హైకోర్టులు తీసుకున్న నిర్ణయాలలో తమకు తప్పేమీ కనిపించడం లేదని పేర్కొంది. 'అన్ని కేసులకూ ఇదే విధానం సరిపోతుందని ఎలా చెప్పగలం? ఈ విషయంలో హైకోర్టులు ఇచ్చిన తీర్పులు సరైనవే'నని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అమ్మాయిల వివాహ వయసు విషయంలో అంతటా ఒకే విధానాన్ని తీసుకురావాలనుకుంటే సంబంధిత ప్రభుత్వ అథారిటీని జాతీయ మహిళా కమిషన్ సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించింది.

  • Loading...

More Telugu News