: జన్యువులు కూడా మనం చెప్పినట్టు వింటాయి
మన శరీరంలోని జన్యువులను చక్కగా పనిచేసేలా చేయవచ్చు... కాదనుకుంటే వాటిని అసలు పనే చేయకుండా ఆపేసేయవచ్చు. ఇలా చేసే కొత్తరకం సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ పరిజ్ఞానంతో జన్యువుల పనితీరును, వాటి పాత్రను మరింతగా అర్ధంచేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), బ్రాడ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక సరికొత్త తేలికైన పరిజ్ఞానాన్ని రూపొందించారు. ఈ పరిజ్ఞానం ద్వారా కణాల మీద వెలుగును ప్రసరింపజేయడం ద్వారా జన్యువులు పనిచేసేలా, ఆపేసేలా చేయవచ్చు. మన శరీరంలో 20వేల జన్యువులు ఉన్నప్పటికీ అవి అన్నీ నిరంతరం చురుగ్గా ఉండవు. కణాల అవసరాలనుబట్టి ఏ నిమిషమో లేదా గంటసేపో పనిచేస్తుంటాయి. అయితే ఆ సమయంలో జన్యువులు ఏం చేస్తుంటాయి? అనే విషయాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ పరిజ్ఞానాన్ని తయారు చేశారు. ఈ పరిజ్ఞానంలో కాంతికి స్పందించి పనితీరును మార్చుకునే ప్రోటీన్ల సాయంతో పనిచేసే (ఆప్టోజెనెటిక్స్) పరిజ్ఞానం ఆధారంగా దీన్ని అభివృద్ధిచేశారు. లక్షిత జన్యు వ్యక్తీకరణను మార్చేందుకు శాస్త్రవేత్తలు కాంతి గ్రాహక ప్రోటీన్లను ఇందులో ఉపయోగించుకున్నారు.