: కార్బన్‌డయాక్సైడ్‌తో కొత్త కరెంటు!
కరెంటును ఉత్పత్తి చేయడానికి రకరకాల మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే కార్బన్‌డయాక్సైడ్ నుండి కూడా కరెంటును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందుకోసం ప్రత్యేక పద్ధతిని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనివల్ల బోలెడంత ఇంధనం ఆదా కావడమే కాదు... వృధాగా ఉండే వాయువును ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికన్ కెమికల్ సొసైటీ పత్రిక ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ప్రచురించారు. విద్యుత్తు కేంద్రాలు, ఇతర పరిశ్రమలు విడుదల చేసే కార్బన్‌డయాక్సైడ్ నుండి కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ విధానం గురించి బెర్ట్ హ్యామెలెర్స్ అనే శాస్త్రవేత్త వివరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు బొగ్గు, చమురు, సహజవాయువుల దహన చర్యల ద్వారా ఏటా 12 బిలియన్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను విడుదల చేస్తున్నాయని, అలాగే గృహాలు, వాణిజ్యపరమైన మార్గాల నుండి మరో 11 బిలియన్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్ విడుదలవుతోందని తెలిపారు. ఇలా విడుదలయ్యే సీఓ2ను వృధాగా బయటికి వదిలేయడం వల్ల ఇది భూతాపాన్ని పెంచడంలో కీలక పాత్ర వహిస్తోందని బెర్ట్ వివరించారు.
ఈ విధంగా వృధాగా వాతావరణంలోకి విడుదలవుతున్న వ్యర్థ వాయువును మళ్లీ ఉపయోగంలోకి తీసుకురావాలని హ్యామెలెర్స్ బృందం భావించింది. తాము నిర్వహించిన ప్రయోగాల్లో సీవో2 నీరు ఇతర పదార్థాలతోను ప్రతిచర్య జరుపుతుందని, ఇది విద్యుత్తు ఉత్పత్తికి తోడ్పడుతుందని హ్యామెలెర్స్ బృందం చెబుతోంది. ఇలా విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమలు, గృహాల నుండి విడుదలవుతోన్న కార్బన్‌డయాక్సైడ్‌ను ఉపయోగించి ఏటా 1,570 బిలియన్ కిలోవాట్ల అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.