: వీడు స్నానం చేయాలంటే ఫైరింజన్ రావాల్సిందే!
అనగనగా ఓ అబ్బాయి... ఈ అబ్బాయి వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. అయినా అంత తక్కువ వయసే అయినా స్నానానికి ఫైరింజన్ రావడం ఏంటనేగా మీ సందేహం... నిజమే ఇతను స్నానం చేయాలంటే మామూలు విషయం కాదు. చక్కగా ఫైరింజన్ వచ్చి అతణ్ని తీసుకెళ్లి బాత్రూంలో స్నానం చేయించాల్సిందే... అంత బరువుంటాడుమరి.
చైనాలోని లయానింగ్ ప్రావిన్స్‌లో ఉన్న అగ్నిమాపక దళం పరిధిలో ఒకనాడు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. ఈ ఫోన్‌కాల్ సమాచారం ఏమంటే... అగ్ని ప్రమాదం సంభవించింది. వచ్చి కాపాడండి అని కాదు... మీరు వచ్చి మా బాబుకు స్నానం చేయించండి.... అని... దీంతో పాపం ఫైర్ స్టేషన్ అధికారులు ఆశ్చర్యంతో నోరు తెరిచారు. తీరా వెళ్లి చూస్తే పాపం తల్లి అవస్థ ఎలాంటిది? అనే విషయం ఫైర్ సిబ్బందికి అవగాహనకు వచ్చింది. సదరు 19 ఏళ్ల అబ్బాయి బరువు అంతా ఇంతా కాదు... ఏకంగా 150 కేజీలు. మరి ఇంతటి బరువున్న భీముణ్ని బాత్రూం దాకా తీసుకెళ్లి స్నానం చేయించడం అంటే మాటలా... బరువు మాత్రమే కాదు... ఈ అబ్బాయి సెరిబ్రల్ పాల్సీ బాధితుడు. నడవలేడు.
దీంతో అతణ్ని బాత్రూందాకా తీసుకెళ్లి స్నానం చేయించడం అనేది తల్లి వల్ల సాధ్యం అయ్యే పనికాదు. దీంతో ఆమె చేసేది లేక అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి తన కొడుక్కి స్నానం చేయించాల్సిందిగా అభ్యర్థించింది. పాపం ఆమె బాధను అర్ధం చేసుకున్న అగ్నిమాపక అధికారి ఏడుగురు సిబ్బందిని సదరు బాబుకు స్నానం చేయించడంకోసం పంపించాడు. వాళ్లు వచ్చి ఆ స్నానాలు కాస్తా పూర్తి చేసి, మళ్లీ అతణ్ని అతని గదిలోకి తీసుకొచ్చారు.