: మళ్లీ అల్పపీడనం.. వదలని వరదలు
వరుణుడి తీవ్రత రాష్ట్రాన్ని వదలడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో తన అనుగ్రహాన్ని మోతాదుకు మించి ప్రదర్శించిన వానదేవుడు మరోసారి తన ప్రతాపం చూపేలా ఉన్నాడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వందలాది మందిని నిరాశ్రయులను చేసిన వానలు మళ్లీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయనున్నాయి. తాజాగా, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఆవరించి ఉంది. దీని ప్రభావంతో తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండల్లా జలకళ సంతరించుకున్నాయి. జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది.