: అబద్ధాలు చెప్పేందుకు సిగ్గుండాలి: బాబు
అవినీతి సొమ్ముతో పత్రిక, టీవీ చానల్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సిగ్గులేకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. హైదరాబాదులో నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తొలి విడత ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థుల్లో అత్యధికులు జగన్ పార్టీకే చెందినవారని వారు ప్రచారం చేసుకోవడాన్ని బాబు తప్పుబట్టారు. ఆ విధంగా చెప్పుకోవడానికి వారు సిగ్గుపడడంలేదంటూ ఆయన సాక్షి పత్రిక మొదటి పేజీ వార్తను ప్రదర్శించారు.
ఆ పార్టీ అరాచకవాదులు, దొంగనోట్ల వ్యాపారులు, హంతకులతో నిండిపోయిందని విమర్శించారు. ఇటీవలే ఏలూరులోని ఏటీఎంలో గార్డును హత్య చేసిన ఉదంతంలో ఆ పార్టీ నేతే నిందితుడు కావడాన్ని బాబు ఈ సందర్భంగా ఎత్తిచూపారు. ఇక మరోవ్యక్తి దొంగనోట్లు చలామణీ చేస్తూ సర్పంచి ఎన్నికల్లో పోటీచేశాడని తెలిపారు. ఇక, కడప, పులివెందులలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని అన్నారు. అక్కడ స్వేచ్ఛగా ఓటేసే వీలులేదని వెల్లడించారు.
పంచాయతీ ఎన్నికల తొలి విడతలో తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చిన సర్పంచి అభ్యర్థుల్లో అత్యధికులు గెలుపొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రెండు, మూడవ విడత ఎన్నికల్లోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 9 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని చెబుతూ, పంచాయతీ రాజ్ వ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందన్నారు. తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలకు పూర్తి అధికారాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తొలి విడత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు బాగా పనిచేశారంటూ కితాబిచ్చారు.