: జింబాబ్వేతో భారత్ పోరు నేడే... కోహ్లీ కెప్టెన్సీకి కొలమానం
భారత్, జింబాబ్వే జట్ల మధ్య 'సెల్ కాన్ కప్' ఐదు వన్డేల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగనుంది. ధోనీ, ఇషాంత్, భువనేశ్వర్, అశ్విన్, ఉమేష్ లాంటి రెగ్యులర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన టీమిండియా ఈ సిరీస్ లో రిజర్వ్ బెంచ్ తో బరిలో దిగనుంది. కాగా, కెప్టెన్ కోహ్లీ ఇప్పటికే జింబాబ్వేను ఆటాడుకుంటామని ప్రకటించేశాడు.
కెప్టెన్ గా కోహ్లీ, ఇప్పటికే విండీస్ టూర్ లో తనను తాను నిరూపించుకున్నప్పటికీ వరుణుడి ప్రభావంతో అతని సామర్ధ్యం అంతగా వెలుగులోకి రాలేదు. కానీ ఈసారి అతను తన వ్యూహాల్ని స్వేచ్ఛగా అమలు చేయవచ్చు. ఈ సిరీస్ లో భారీ విజయాలు సాధిస్తే.. అవి అతని నాయకత్వ ప్రతిభకు మచ్చుతునకలుగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో, భావి కెప్టెన్ గా కోహ్లీని నిర్ణయించేది ఈ సిరీసే అనడంలో సందేహం లేదు. మరి కోహ్లీ ధోనీ వారసత్వాన్ని కొనసాగిస్తాడా? లేక అతివిశ్వాసంతో బొక్కబోర్లా పడతాడా? అన్నది చూడాలి.
కాగా జింబాబ్వే ను పూర్తి బలహీన జట్టుగా తీసిపారేయలేము. ఎందుకంటే ఆ జట్టుకు సంచలన విజయాలు కొత్తకాదు. కెన్యా, ఐర్లాండ్, ఆసీస్-ఏ వంటి జట్లతో పోటీ పడుతూ తన సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూనే ఉంది. తాజాగా శ్రీలంక వంటి జట్లను ఓడించి, తాను మరీ అంత తేలికపాటి ప్రత్యర్ధిని కాదంటూ హెచ్చరికలు పంపింది. అయితే ఫ్లవర్ బ్రదర్స్, హీత్ స్ట్రీక్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో లేకపోయినా, సమయోచితంగా ఆడగలిగిన కొత్తముఖాలు ప్రస్తుత జింబాబ్వే జట్టులో చాలా ఉన్నాయి. ఏది ఏమైనా.. సిరీస్ లో విజేతగా భారత్ నిలిచినా, ఎంత తేడాతో గెలుస్తుంది? ఎవరెవరు టీమిండియా బెర్తులను పటిష్ట పరుచుకుంటారన్నది ఈ సిరీస్ లో తేలిపోనుంది.