: 'క్లీన్ ఇండియా' అంటున్న చిరంజీవి
విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి కేంద్ర పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టబోతోంది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో 'క్లీన్ ఇండియా' పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించనుంది . ఆగ్రాలోని తాజ్ మహల్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఈ రోజు కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి ప్రారంభిస్తున్నారు. దేశంలోని చారిత్రక కట్టడాల సంరక్షణ, పర్యాటకులకు పరిశుభ్రమైన వసతి, సదుపాయాల కల్పనలో ప్రయివేటు సంస్థలను భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో అనుకుంటోంది. ఇప్పుడీ కార్యక్రమంతో ఆచరణ రూపం దాలుస్తోంది.
ఓఎన్జీసీ సహకారంతో ఈ 'క్లీన్ ఇండియా' కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మనదేశంలో టూరిజం ప్రదేశాలు అనేకం ఉన్నా, సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే పర్యాటకులు రావడంలేదని మంత్రి చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో లోపాలను సరిదిద్దే పనిని చేపట్టామని చిరు వెల్లడించారు. ముందుగా తాజ్ మహల్ కు సంబంధించి చేయాల్సిన పరిశుభ్రతను చేపడుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని టూరిస్టు ప్రాంతాలను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.