: బ్రాండెడ్ నేమ్ లేకుంటేనే మంచిదట!
సిగరెట్టు తాగడం మానండి బాబూ అంటే ఎవరూ వినరు. అయితే ఇలా ఎక్కువమంది సిగరెట్లు తాగడం వేపు ఆకర్షితులు కావడానికి కారణం సదరు సిగరెట్ పెట్టెలు ఆకర్షణీయంగా ఉండడమేనట. ఒకవేళ సిగరెట్ పెట్టెలు ఆకట్టుకునే విధంగా లేకుంటే ప్రజలు ఎక్కువగా దానివేపు ఆకర్షితులుకారని తాజా అధ్యయనం చెబుతోంది.
ఆష్ట్రేలియాలో 2012లో ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలో సిగరెట్ పెట్టెలపై ఆయా కంపెనీల లోగోలు, రంగులతో కూడిన అలంకరణలు లాంటివి చేయకుండా కేవలం నిర్దేశించిన పరిమాణంలోనే బ్రాండ్ పేరుండి, ప్యాక్‌పై చట్టబద్ధమైన హెచ్చరికలు ఉండేలా ప్యాక్ చేయాలి. అయితే ఈ విధానం పొగరాయుళ్లపై ఎలాంటి ప్రభావం చూపింది అనే విషయంపై ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో ఇలా ఎలాంటి ఆకర్షణ లేకుండా ఉండే సిగరెట్ ప్యాకింగ్ వల్ల సిగరెట్టు తాగాలనే కోరిక తగ్గడమే కాకుండా అసలు పొగతాగాలనే అలవాటును కూడా వదిలేయాలని పొగరాయుళ్లు భావిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
ఇందుకోసం వీరు 536 మంది పొగరాయుళ్లను పరిశీలించారు. వీరిలో 27.7 శాతం మంది బ్రాండెడ్ ప్యాకెట్‌లో ఉన్న సిగరెట్లను తాగుతుండగా 72.3 శాతం మంది ప్లేస్ ఫ్యాక్‌లను వాడుతున్నారు. అయితే ఇలా ప్లేస్ ప్యాక్‌లలో ఉన్న సిగరెట్లను తాగేవారు అవితాగిన తర్వాత అవి తక్కువ నాణ్యతను కలిగివున్నాయని, గతంలోకంటే అవి తక్కువ సంతృప్తిని ఇస్తున్నట్టు భావిస్తున్నారని తేలింది. అంతేకాదు అసలు పొగతాగాలనే అలవాటును కూడా మానుకోవాలని వీరు ఆలోచిస్తున్నారట. బ్రాండెడ్ సిగరెట్లు తాగేవారికంటే ప్లేస్ ప్యాక్‌లోని సిగరెట్లను కాల్చేవారే ఎక్కువగా ఈ విధానానికి మద్దతు పలుకుతున్నట్టు కూడా పరిశోధకులు గుర్తించారు.