: లక్షల సంవత్సరాల క్రితమే వేడి పెరిగింది


భూమి వేడెక్కిపోతోంది అంటూ ఇప్పుడు అరవడం కాదు... నిజానికి కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే భూమి వేడి పెరిగిపోతోందట. దీనివల్ల అంటార్కిటికాలోని మంచు పలకలు కరిగి సముద్ర మట్టం కూడా పెరిగిపోయిందని పరిశోధకులు చెబుతున్నారు.

లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన కొందరు పరిశోధకులు అంటార్కిటికాలోని మంచు పలకలు కరగడంపై పరిశోధనలు సాగించారు. వీరు సాగించిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటార్కిటికా సముద్రతీరంలో మూడు కిలోమీటర్ల లోతులో వీరు సేకరించిన బురద నమూనాల ఆధారంగా జరిపిన అధ్యయనంలో సుమారు 50 లక్షల సంవత్సరాల క్రితమే భూతాపం పెరగడం ప్రారంభించిందని, అప్పటి నుండి అక్కడి మంచు పలకలు కరిగి సముద్రమట్టం 20 మీటర్ల మేర పెరిగిందని తేలింది.

30 లక్షల నుండి 50 లక్షల ఏళ్ల క్రితం ఉండే కాలాన్ని ప్లయోసెస్‌ యుగంగా పిలిచేవారని, అప్పుడు సముద్రమట్టం 10 మీటర్ల మేర పెరిగిందని వీరు గుర్తించారు. ఇదే సమయంలో పశ్చిమ అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌లో కూడా కొంతభాగం మేర మంచు పలకలు కరిగినట్టు గతంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో మొత్తం మీద 20 మీటర్ల మేర సముద్ర మట్టం పెరిగినట్టు శాస్త్రవేత్తలు వివరించారు. అసలు సముద్ర మట్టం ఎలా పెరుగుతుంది అనే విషయాన్ని ప్లయోసెస్‌ యుగం వెల్లడించిందని, ప్రస్తుతం భూతాపం వల్ల వచ్చే ప్రతికూల పరిణామాలకు ఇదో హెచ్చరిక అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లయోసెస్‌ యుగంకన్నా ప్రస్తుతం రెండు మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని, అలాగే కార్బన్‌డైయాక్సైడ్‌ స్థాయి కూడా ఒకేలా ఉందని ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన డాక్టర్‌ టినీ వాన్‌ డి ఫ్లెర్డెట్‌ చెబుతున్నారు. ఫ్లెర్డెట్‌ మాట్లాడుతూ ఈ శతాబ్దం చివరికి ప్లయోసెస్‌ యుగం నాటి స్థాయికి భూతాపం చేరుకుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారని, అందువల్ల రాబోయే పరిణామాల గురించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News