: ఇంటి దగ్గర భర్త మృతదేహం, అయినా ఓటేసిన వైనం
ఇది భారతీయ మహిళ గొప్పదనానికి నిదర్శనం..! మహిళల నిబ్బరాన్ని చాటే ఘటన విశాఖపట్టణం జిల్లా చింతపల్లి ఏజెన్సీలో జరిగింది. భర్త అనారోగ్యంతో మృతి చెందగా, గుండెనిబ్బరంతో ఆమె ఓటేసి ప్రజాస్వామ్యంపై గౌరవాన్ని ప్రదర్శించింది. చింతపల్లి మండలంలో మారుమూల ఉన్న కిటుముల పంచాయతీ కేంద్రంగా ఉన్న భీమునాపల్లిలో కొర్ర నర్సింహారావు(40) మృతి చెందారు. గ్రామంలో అంతా ఓటేసేందుకు వెళ్లగా వారితో అతని భార్య కొర్రా చిలకమ్మ(38) కూడా ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. భారత ప్రజాస్వామ్యంలో విద్యావంతులు చూపని చొరవ ఒక గిరిజన మహిళ చూపడంతో ఆమెను చూసి ఆశ్చర్యపోయిన అధికారులు అభినందించారు. అనంతరం చిలకమ్మ గ్రామం చేరుకుని తన భర్త అంత్యక్రియలు పూర్తి చేసింది.