: 'కారు' బోరు.. హస్తం వైపు వివేక్ చూపు
పార్టీ ఫిరాయించి, ఉత్సాహంగా టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ కు 'కారు' ప్రయాణం బోరు కొట్టినట్టుంది. తనతోపాటు టీఆర్ఎస్ లో చేరిన కె.కేశవరావును మాత్రమే ఫోకస్ చేస్తూ పార్టీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో కినుక వహించిన వివేక్.. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారనున్నారా? అంటే అవునంటున్నాయి అతని సన్నిహిత వర్గాలు. కొండంత ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీని తృణీకరించి, గులాబీ జెండా కప్పుకున్న వివేక్, కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఇంత ప్రగతి సాధిస్తుందని ఊహించలేకపోయారు.
అయితే, కాంగ్రెస్ పార్టీలో ఉండగా, తన గృహమే అధికారిక కార్యాలయంగా జరిగే సమావేశాలు లేకపోవడం, కనీసం మీడియా కూడా తనవంక కన్నెత్తి చూడకపోవడంతో మనస్తాపానికి గురవుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ మిత్రులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో వివేక్ వివేకవంతమైన నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో దళిత నేతైన షిండేను కలిశారని, తాను పార్టీని వీడలేదని వివరణ ఇచ్చారని అంటున్నారు. రేపో మాపో ఆయన మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశముందని కూడా భావిస్తున్నారు.