: ములాయం సింగే ప్రధాని అభ్యర్థి: ప్రకాశ్ కరత్
2014 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, సమాజ్ వాదీ పార్టీ మంచి పనితీరు కనబరిస్తే ములాయం సింగ్ యాదవ్ ప్రధాని అభ్యర్థి అవుతారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో ఒక టీవీ చానల్ తో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ములాయం గతంలో తమతో కలిసి పనిచేశారని, రానున్న ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే, ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థిగా మారతారని ప్రకాశ్ కరత్ తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో వామపక్షాలు తమ స్థానాలను మెరుగుపరుచుకుంటాయని, కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీలు బలహీనంగా ఉన్నాయని అభివర్ణించారు. ప్రాంతీయంగా కొత్త పొత్తులు ఉండవచ్చని, ఎన్నికల అనంతరమే కొత్త ఫ్రంట్ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అయితే వామపక్షాలు కాంగ్రెస్ కు ఏ మాత్రం మద్దతునివ్వబోవని స్పష్టం చేశారు. గుజరాత్ తరహా పాలనను కూడా కారత్ తోసిపుచ్చారు.