: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్రానేకు రూ.1.20కోట్ల ముడుపులు


మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రానే(దివంగత)కు 1.20కోట్ల రూపాయల ముడుపులు అందాయని ఢిల్లీ పోలీసులు తేల్చారు. 13 ఏళ్ల విచారణ తర్వాత.. 2002 నాటి మ్యాచ్ ఫిక్సింగ్ కేసు చార్జ్ షీటులో ఢిల్లీ పోలీసులు ఈ మేరకు అభియోగాలు నమోదు చేశారు. లండన్ కు చెందిన బుకీ సంజీవ్ చావ్లా నుంచి 60 లక్షల చొప్పున రెండు విడతలుగా మొత్తం 1.20కోట్ల రూపాయలు ముట్టాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచుల ఫిక్సింగ్ కోసం ఈ ముడుపులను క్రానే స్వీకరించినట్లు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం క్రానే జీవించి లేనందున కేసులో ఆయన పేరును తొలగించేందుకు కోర్టు అనుమతి కోరారు.

క్రానేతోపాటు లండన్ కు చెందిన బుకీ సంజీవ్ చావ్లా, బుకీ మన్మోహన్ ఖట్టర్, ఢిల్లీకి చెందిన బుకీ రాజేష్ కర్ల, సునీల్ దారా, టి సీరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ సోదరుడు క్రిషన్ కుమార్ పేర్లను పోలీసులు చార్జ్ షీటులో పేర్కొన్నారు. 1999లో వ్యాపార వేత్త రామకుమార్ గుప్తా ముడుపుల కేసును విచారిస్తున్న సమయంలో ఢిల్లీ పోలీసులకు మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించిన ఆధారాలు లభ్యం కావడంతో ఇది బయటపడింది. కేసు విచారణలో భాగంగా 2000 మార్చిలో బుకీల సంభాషణలను పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News