: యాషెస్ రెండో టెస్టులో ఆసీస్ చిత్తు చిత్తు
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియాను 347 పరుగులతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. తొలిటెస్టులో దీటుగా ఆడిన ఆసీస్ జట్టు రెండో టెస్టులో మాత్రం ఇంగ్లండ్ ధాటికి చేతులెత్తేసింది. తాజా విజయంతో 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 2-0తేడాతో ముందంజ వేసింది. 333/5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు మరో 16 పరుగులు మాత్రమే జోడించి 349/7 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ జో రూట్ 180 పరుగులతో రాణించగా అతనికి బెల్ 74 పరుగులతో చక్కని సహకారమందించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హారిస్ 5 వికెట్లు తీసుకుని రాణించాడు.
అనంతరం 583 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ఏ దశలోనూ ధాటిగా ఆడలేపోయింది. స్వాన్(4/74) రూట్(2/9) సూపర్ స్పెల్ తో చెలరేగడంతో ఆసీస్ బ్యాట్స్ మెన్ క్రీజులో కుదురుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో, కేవలం 235 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు ఆలౌటైంది. క్లార్క్, ఖవాజా అర్ధ సెంచరీలతో రాణించినా, వాటిని మరింత భారీస్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. ఇంగ్లండ్ ఓపెనర్ రూట్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మూడో టెస్టు మాంచెస్టర్ లో ఆగస్టు 1 న ప్రారంభం కానుంది.
రెండో టెస్టు విజయం తరువాత ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆకాశానికెత్తేసింది అక్కడి మీడియా. కాగా ఆస్ట్రేలియన్లపై రెండు దేశాల మాజీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. క్రీజులో కదలడానికే ఇబ్బంది పడుతున్నారంటూ.. ప్రధానంగా టాపార్డర్ పై విరుచుకుపడ్డారు. ఆసీస్ జట్టు తాజా ప్రదర్శనతో ఆటగాళ్లలో విభేదాలపై మరోసారి విమర్శలు చెలరేగుతున్నాయి.