: సాగరాన్ని ఈదడం తేలికే!
సాగరం ఈదడం తేలికేం కాదురా అంటూ పాట పాడుకోవడం కాదు... సాగరం ఈదడం కూడా తేలికే అని ఇకపై మనం పాడుకోవచ్చు. సాగరాలు ఈదాలంటే పలు ప్రమాదాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా సముద్రంలో ఉండే భయంకరమైన షార్క్ చేపల బారిన పడకుండా ఈదడం సామాన్య విషయం కాదు. ఒకవేళ షార్క్ చేపలు ఎదురైతే ఇక ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. అయితే ఇప్పటి వరకూ ఉండే ఇలాంటి పరిస్థితికి స్వస్తి చెప్పి, సాగరాన్ని అవలీలగా ఈదవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే షార్క్ చేపలకు ఇకపై భయపడాల్సిన పని లేదని, వాటిని కూడా భయపెట్టే ఒక కొత్త రకం సూట్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు.
అనంత సాగరం గురించి అన్వేషించడంపై ఆసక్తి ఉండే డైవర్స్ ఎక్కువగా ఎదుర్కొనే ప్రధాన ప్రమాదకరమైన సమస్య సొరచేపలు దాడిచేయడం. అయితే ఆష్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఇలాంటి సొర చేపలను భయపెట్టే ఒక కొత్తరకం డైవ్‌సూట్‌ను డిజైన్ చేశారు. ఈ డైవ్‌సూట్‌ను ధరించిన డైవర్స్‌ను చూసి సొర చేపలు కూడా భయపడి పక్కకు తప్పుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 'ఎల్యూడ్' అనే ఈ వస్త్రాల్లో ప్రధాన భాగం నీలిరంగులో ఉండేలా వీటిని తయారు చేశారు. సొరచేపలకు కలర్ బ్లైండ్‌నెస్ ఉంటుంది. దీంతో అవి నీలి రంగును చూడలేవు. మిగలిన గీతలు సముద్రంలోని ఒక రకమైన విషపూరితమైన చేపల ఆకారాన్ని పోలి ఉండేలా డ్రస్‌ను డిజైన్ చేయడంతో ఆ డ్రస్‌ను చూసిన సొరచేపలు భయంతో పక్కకు తప్పుకుంటాయని శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.