: ఆ బాంబులు పేలివుంటే...?
ఇప్పుడు బాంబులు ఎక్కడబడితే అక్కడ పేలుతున్నాయి. వాటివల్ల జరగాల్సిన ప్రాణనష్టం జరిగిపోతోంది. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించిన బాంబులు గుర్తుకొస్తే... ఒక్కసారిగా వణుకు పుడుతుంది. సరిగ్గా హంగేరి ప్రభుత్వం ఇలాగే వణికిపోతోంది. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన బాంబులు అక్కడ తవ్వకాల్లో బయటపడుతున్నాయి. దీంతో హంగేరి ప్రభుత్వం భయంతో వణికిపోతోంది.
హంగేరిలోని బుడాపెస్ట్‌కు సమీపంలో జెకెస్‌ఫెహెర్వర్ నగరంలో ఒక నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా అక్కడ సుమారు వంద కేజీల బరువున్న బాంబు బయటపడింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ బాంబు ఆ కాలంలో పేలకుండా భూమిలో కూరుకుపోయిన బాంబుల్లో ఒకటిగా చెప్పవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హంగేరి నాజీ సైనికుల చేతుల్లో ఉండేది. ఈ దేశంలోని నగరాలు, పట్టణాలపై అప్పట్లో అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ దేశాలకు చెందని సైనిక దళాలు భీకర స్థాయిలో బాంబుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా బుడాపెస్ట్ నగర ప్రాంతంలోనే 37 సార్లు బాంబుల వర్షం కురిసింది. ఈ బాంబుల వర్షంలో పలు పేలని బాంబులు భూమిలో కూరుకుపోయాయి.
అప్పటి నుండి నిర్మాణ కార్యక్రమాలకొరకు జరుగుతున్న తవ్వకాల్లో ఈ బాంబులు వెలుగుచూస్తూ వస్తున్నాయి. 2008 లో బుడాపెస్ట్‌లో ఇలా 14 సార్లు బాంబులు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా బయటపడ్డ బాంబు ఇప్పటి వరకూ బయటపడిన బాంబులకన్నా అత్యంత శక్తిమంతమైంది, బరువైంది కూడా కావడంతో భయపడిన హంగేరి ప్రభుత్వం, ఆ బాంబు లభ్యమైన ప్రాంతం నుండి సుమారు పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. జనావాసాల నడుమ ఇంతపెద్ద బాంబు బయటపడడం ఇదే మొదటిసారిగా అక్కడి అధికారులు చెబుతున్నారు.