: దిగ్విజయ్ సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు
ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆయన ట్విట్టర్లో చేసిన ఓ వ్యాఖ్య పట్ల అభ్యంతరం చెబుతూ, భోపాల్ కు చెందిన సంగీత్ వర్మ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే స్వలింగ సంపర్కం ఆరోపణలపై రాజీనామా చేసిన బీజేపీ మంత్రి రాఘవ్ జీ (మధ్యప్రదేశ్) ఉదంతంపై స్పందిస్తూ దిగ్విజయ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. 'రామ్ మరియు రాఘవ్ జీ' అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్య హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందని సంగీత్ వర్మ భోపాల్ లోని షాపూరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాఘవ్ జీ.. తనతో అసహజమైన రీతిలో, స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్నాడంటూ ఆయన ఇంటి పనివాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, పోలీసులు రాఘవ్ జీని అరెస్టు చేసి రిమాండుకు పంపారు.