: 'అవనిగడ్డ' ఏకగ్రీవానికి టీడీపీ యత్నం
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఉప ఎన్నిక ఏకగ్రీవానికి అన్ని పార్టీలను సంప్రదిస్తామని టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు చెప్పారు. గత ఏప్రిల్ 21న ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మరణించడంతో అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దాంతో, కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఉప ఎన్నిక షెడ్యూలు ప్రకటించింది. ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల కానుండగా, వచ్చేనెల 3వ తేదీ నామినేషన్ల చివరి గడువుగా నిర్ణయించారు. తిరిగి 5వ తేదీన నామినేషన్లను పరీశీలిస్తారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు 7వ తేదీ చివరి గడువుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఇదిలావుంటే పోటీ అనివార్యమైతే అంబటి కుమారుడు హరిబాబును పోటీకి దింపాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.