: ఈ వైరస్‌లు చాలా పెద్దవి
ఇప్పటి వరకూ మనకు కంటికి కనిపించని పరిమాణంలోని వైరస్‌ల గురించి మాత్రమే తెలుసు. అయితే వాటన్నింటికన్నా పెద్ద వైరస్‌లు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వైరస్‌లు ఇప్పటి వరకూ కనుగొన్న వైరస్‌లతో పోల్చితే పరిమాణంలో పెద్దవిగానే ఉండడమే కాకుండా, అధిక సంఖ్యలో జన్యువులను కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌కి చెందిన ఫ్రెంచ్ శాస్త్రవేత్తల బృందం చిలీ, ఆష్ట్రేలియాల్లోని నదీ జలాల్లో ఒక కొత్తరకం వైరస్‌లను కనుగొన్నారు. ఈ వైరస్‌లు ఇప్పటి వరకూ ప్రపంచానికి తెలిసిన వైరస్‌లకన్నా పెద్దగా ఉన్నాయి. ఈ వైరస్‌లలో ఒక్కో దానిలో దాదాపు 2,500 జన్యువులున్నాయి. ఈ జన్యువుల్లో సుమారు 93 శాతం జన్యువులు ఇప్పటి వరకూ సైన్స్ ప్రపంచానికి తెలియదు. కొత్తగా కనుగొన్న ఈ వైరస్‌లు కొత్తజాతికి చెందినవిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వైరస్‌లు వైరస్ ప్రపంచానికి సంబంధించిన కొత్త కోణాలను వెల్లడించే అవకాశాలున్నట్టుగా పరిశోధకులు చెబుతున్నారు. ఈ కొత్తరకం పెద్ద సైజు వైరస్‌లకు 'పండోరా వైరస్' అనే పేరు పెట్టారు. సరిగ్గా పదేళ్ల క్రితం ఈ కొత్త రకం వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్తల బృందమే 'మిమీ వైరస్'ను గురించి ప్రపంచానికి తెలియజేసింది.