: తమిళ తంబీల ఆగ్రహానికి గురైన బాలీవుడ్ చిత్రం
మొన్న కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం' తమిళుల ఆగ్రహానికి గురై రిలీజ్ అవడానికి ఎన్ని ఇబ్బందులు పడిందో తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లేటెస్టు మూవీ 'మద్రాస్ కేఫ్' కూడా ఇలాగే తమిళుల కోపానికి కారణమైంది. ఈ చిత్రాన్ని'విక్కీ డోనర్' చిత్రం దర్శకుడు షూజిత్ సర్కార్ రూపొందించారు. జాన్ అబ్రహాం, నర్గీస్ ఫక్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ఈ మధ్యనే విడుదలైంది.
ఇందులో ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలమ్) సభ్యులను టెర్రరిస్టులుగా చూపారంటూ 'నామ్ తమిళర్'(మేము తమిళులం) అనే తమిళ కార్యకర్తల గ్రూపు ఆందోళన వ్యక్తం చేస్తోంది. విడుదల చేసేముందు చిత్రాన్ని ఒకసారి తమకు చూపించాలని కోరారు. చూపించకపోతే తమిళనాడులో చిత్ర విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడుతున్న వారిని ఇలా ఎందుకు చూపుతారంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని చిత్రాన్ని తమిళనాడులో నిషేధించాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేశారు. మరో నిర్మాతతో కలిసి జాన్ అబ్రహామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల కాబోతుంది.