: నేరం నిరూపితమైతే సల్మాన్ కు పదేళ్ళ జైలు.. నిర్మాతలకు కష్టాలే!
తాగిన మైకంలో కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు నేరం నిరూపితమైతే పదేళ్ళ వరకు జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. సల్మాన్ 2002లో ముంబయిలో ఓ అర్థరాత్రి మద్యం మత్తులో కారును ఫుట్ పాత్ పైకి పోనివ్వడంతో అక్కడ నిద్రిస్తున్న వారిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ కేసులో నేడు సల్మాన్ కోర్టుకు హాజరుకాగా విచారణ బుధవారానికి వాయిదా పడింది. అయితే, ఈ కేసులో సల్మాన్ పై ప్రాసిక్యూషన్ అభియోగాలు నిరూపితమైతే అతనికి పదేళ్ళ జైలుశిక్ష పడొచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే సల్మాన్ నిర్మాతలు కోట్లమేర నష్టపోతారు.
ఇటీవల కాలంలో సల్మాన్ నటించిన ప్రతి చిత్రం వంద కోట్ల వసూళ్ళను రాబట్టింది. ఈ విధంగానూ పరిశ్రమకు నష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. దబాంగ్, రెడీ, బాడీగార్డ్, దబాంగ్-2, ఏక్ థా టైగర్ చిత్రాలతో సల్మాన్ బాలీవుడ్ బంగారుబాతులా అవతరించాడు. తాజాగా 'మెంటల్' చిత్రంలో నటిస్తున్నాడు. మరికొన్ని చిత్రాలనూ అంగీకరించినట్టు తెలుస్తోంది.