: వడగాడ్పుడలతో ఇంగ్లండ్ లో 760 మంది మృతి
తీవ్రమైన వడగాలులు ఇంగ్లండ్ వాసుల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. గత 9 రోజుల్లో సుమారు 540 నుంచి 760 మంది వరకూ మరణించి ఉంటారని 'లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్' కేంద్రం శాస్త్రవేత్తలు అంచనా వేశారు. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్నాయి. ఈ స్థాయిలో నమోదు కావడం ఏడేళ్లలో ఇదే మొదటిసారి. వచ్చే వారం వరకూ ఎండల తీవ్రత కొనసాగుతుందని, మృతుల సంఖ్య రెండింతలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు.
ఉష్ణోగ్రత మరో 4 డిగ్రీలు పెరిగితే నాలుగో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. ఇది అత్యవసరస్థితికి సంకేతం. ఇప్పటికే మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ దీనిని జారీ చేస్తారు. వైద్య సేవల విభాగాలను అప్రమత్తం చేశారు. అంబులెన్సులను 30 శాతం పెంచారు.