: 'రూపాయి' కష్టాలపై ప్రధాని ఆందోళన
పడిపోతున్న రూపాయి మారకం విలువను కాపాడేందుకు ఎగుమతులను పెంచాల్సి ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. ఇందుకు సమయం పడుతుందని చెప్పారు. ఢిల్లీలో ఈ రోజు అసోచామ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. ఫారెక్స్ మార్కెట్లో హెచ్చుతగ్గులే తక్షణ ఆందోళనకరమైన అంశంగా చెప్పారు. దేశం కష్టకాలంలో పయనిస్తోందన్నారు. అయితే, ఆందోళనలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. కరెంటు ఖాతా లోటును 2.5శాతానికి తగ్గించాల్సి ఉందన్నారు. ఇందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని చెప్పారు.
బంగారం, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక మూలాలు పటిష్ఠంగా, ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5శాతం ఉంటుందని అంచనా వేయగా.. అంతకంటే తక్కువే ఉండవచ్చన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో కనిపిస్తాయని చెప్పారు. కొత్త బ్యాంకులకు లైసెన్స్ లను త్వరలోనే జారీ చేస్తామని తెలిపారు.