: కాలుష్యం వల్ల కోట్లు నష్టపోతున్నాం!
మన భారతదేశం కేవలం కాలుష్యభూతం కారణంగా కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోతోందట. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు సేకరించిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇతర విషయాల్లో కాకుండా కాలుష్యం కారణంగా మన దేశంలో సంభవించే శిశు మరణాల వల్లే మన దేశం ఇంత పెద్ద మొత్తం మేర ఆదాయాన్ని నష్టపోతోందని ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదికలో పేర్కొంది.
భారతదేశంలో పర్యావరణ పరిస్థితులు దిగజారిన కారణంగా ఏటా తన స్థూల దేశీయోత్పత్తిలో 5.7 శాతం మేర మొత్తాన్ని నష్టపోతోందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. మన దేశంలో ఏటా సంభవిస్తున్న శిశు మరణాల్లో దాదాపు 25 శాతం కేవలం పర్యావరణ సమస్యలు, కలుషిత తాగునీరు, పారిశుద్ధ్యం కొరవడిన కారణంగానే జరుగుతున్నాయని ప్రపంచ బ్యాంకు 'భారత్‌లో పర్యావరణ సమస్యల మదింపు' అనే పేరుతో రూపొందించిన తన నివేదికలో పేర్కొంది.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2010 నుండి భారత్‌లో ఉన్న పర్యావరణ సమస్యలపై ప్రపంచ బ్యాంకు తయారు చేసిన ఈ నివేదికలో కలుషిత తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణలో లోపాల కారణంగా తలెత్తే వ్యాధుల వల్లే ఎక్కువగా ఐదేళ్లలోపు వయసుండే చిన్నారులు బలవుతున్నారని వెల్లడించింది. ఈ పర్యావరణ సమస్యల వల్ల భారతదేశం ఏటా దాదాపు రూ.4,80,000 కోట్ల మేర భారీ మొత్తం ఆదాయాన్ని కోల్పోతోందని, ఇది భారతదేశ జీడీపీలో 5.7 శాతానికి సమానమని ఈ నివేదిక చెబుతోంది.