: టాస్ గెలిచిన ఇంగ్లండ్
యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సుప్రసిద్ధ లార్డ్స్ మైదానం వేదికగా జరగనున్న ఈ ఐదు రోజుల మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఆతిథ్య ఇంగ్లండ్ పట్టుదలగా ఉండగా.. ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన తొలి టెస్టులో 14 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన ఆసీస్ తన తడాఖా చూపాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకే టాపార్డర్ లో విఫలమవుతున్న కొవాన్ ను తప్పించి అతని స్థానంలో ఉస్మాన్ ఖవాజాను తుది జట్టులోకి ఎంపిక చేసింది. మరోవైపు లెఫ్టార్మ్ సీమర్ మిచెల్ స్టార్క్ స్థానంలో ర్యాన్ హ్యారిస్ కు చోటు కల్పించింది.
తొలి టెస్టు పరాభవంతో స్వదేశంలో మీడియా విమర్శలకు గురైన ఆసీస్ కెప్టెన్ క్లార్క్ కు ఈ మ్యాచ్ విషమపరీక్ష అనడంలో సందేహంలేదు. అందుకే, ఈ మ్యాచ్ లో గెలిచి 5 టెస్టుల సిరీస్ లో సమవుజ్జీగా నిలవాలని క్లార్క్ భావిస్తున్నాడు. ఇక ఇంగ్లండ్ జట్టు ఒక మార్పుతో బరిలో దిగనుంది. పొడగరి పేస్ బౌలర్ స్టీవెన్ ఫిన్ స్థానంలో ఆల్ రౌండర్ టిమ్ బ్రేస్నన్ జట్టులోకొచ్చాడు.