: రాజశేఖరరెడ్డి బ్రాందీ ముట్టుకోలేదని చెప్పగలవా?: షర్మిలకు బొత్స సవాల్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. వైఎస్ కుటుంబంపై తీవ్ర విమర్శలు సంధించారు. ఏడాదిలో ఒక్కరోజైనా వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రాందీ ముట్టలేదని చెప్పగలవా? అంటూ.. తనను పదేపదే లిక్కర్ డాన్ అని సంబోధిస్తున్న షర్మిలకు సవాల్ విసిరారు. హైదరాబాద్ లో ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉన్న సమయంలో అనిల్ తన వద్దకు ఎందుకు వచ్చాడో షర్మిల తెలుసుకోవాలన్నారు. అనిల్ ఏ తప్పు చేసి తనవద్దకు వచ్చాడో అడగాలని షర్మిలకు సూచించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డిని కాంగ్రెస్ నేతగా ఇప్పటికీ గౌరవిస్తామని, కానీ, వారి కుటుంబ సభ్యుల ప్రవర్తనతో తాము ఇలాంటి విషయాలు బహిర్గతం చేయాల్సి వస్తోందని బొత్స చెప్పారు. ఇక విజయమ్మ ఫీజు దీక్షపై మాట్లాడుతూ, అక్రమాలకు పాల్పడే కళాశాలల యాజమాన్యాలకు దన్నుగానే ఈ దీక్ష చేపట్టారని విమర్శించారు. 26 లక్షలమందికి ట్యూషన్ ఫీజులు చెల్లిస్తున్నామని ఆయన వివరించారు.