: కుక్కను చూసి నేర్చుకోవాలి!
కుక్కకున్న పాటి విశ్వాసం కూడా లేదు... అంటూ మనం ఎవరినైనా తిట్టే సమయంలో అంటుంటాం. అయితే విశ్వాసం విషయంలోనే కాదు, తెలివితేటల విషయంలో కూడా కుక్కలు ఎక్కువేనంటున్నారు శాస్త్రవేత్తలు. మనం చెప్పింది చేయడంలోను, ఏదైనా విషయాన్ని నేర్చుకుని దాన్ని గుర్తుంచుకోవడంలోను కుక్కల తెలివి అమోఘమని పరిశోధకులు చెబుతున్నారు. యజమాని చెప్పిన పనిని చేయడంలోను, చేసి చూపించిన పనిని గుర్తుపెట్టుకుని తిరిగి చేయడంలోను కుక్కల తెలివి, జ్ఞాపకశక్తి గొప్పవని ఓ పరిశోధనలో తేలింది.
హంగేరికి చెందిన పరిశోధకులు కుక్కల మేధాశక్తిపై పరిశోధనలు సాగించారు. ఈ పరిశోధనల్లో కుక్కలు తమ యజమానులు చేసి చూపిన పనులను పది నుండి 40 నిముషాల వ్యవధి తర్వాత కూడా గుర్తుంచుకుని మరీ చేయగలవని తేలింది. అంతేకాదు, ఆ కొద్ది సమయంలో వాటి దృష్టి వేరే విషయాల వైపు మరల్చినా కూడా తర్వాత అవి తమ యజమాని చెప్పిన వాటినే తిరిగి చేస్తున్నాయట. తాము ఇదివరకు నేర్చుకున్న వాటినే కాకుండా కొత్త పనులను కూడా ఎప్పటికప్పుడు నేర్చుకుని చేసేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కుక్కల్లో దీర్ఘకాల జ్ఞాపకశక్తి, మనుషుల చర్యలకు సంబంధించిన ఒక ప్రాతినిధ్య వ్యవస్థ ఉందనడానికి ఇది మంచి తార్కాణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.