: షిండేకు లేఖ రాసిన జగన్ పార్టీ ఎమ్మెల్యేలు
తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ, కేంద్రం తమ నిర్ణయం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు రాసిన లేఖలో నిలదీశారు. ఆ తర్వాత మిగతా పార్టీ నేతలను ఢిల్లీకి పిలిచి లోతుగా చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. అలాకాకుండా, తమ నిర్ణయమే ఫైనల్.. అని కాంగ్రెస్ నేతలు నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో సమస్యను పరిష్కరించాలని లేఖలో సూచించారు. రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్ అడ్డగోలుగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయాన్ని కాంగ్రెస్ సొంత వ్యవహారంగా చూస్తోందన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి అప్పగించాలని కోర్ కమిటీ నిర్ణయం తీసుకోవడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని లేఖలో తెలిపారు.