: టాక్సీ డ్రైవర్ పై జాత్యహంకార దాడి, దంపతులకు జైలు శిక్ష
ఓ సిక్కు టాక్సీ డ్రైవర్ పై జాత్యహంకార దాడికి పాల్పడిన దంపతులకు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ కోర్టు తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. జగ్ రూప్ సింగ్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో టాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత సంవత్సరం సెప్టెంబర్ లో దిన్హా బీచ్ యాటింగ్ క్లబ్ వద్ద అతని టాక్సీలో ఏంజెలిన్ కిమ్ సొల్లిట్ (44), మైకెల్ జాన్ అర్బౌన్(40) అనే ఇద్దరు దంపతులు ఎక్కారు. కొంతసేపటికి డ్రైవర్ తలపాగా గురించి కిమ్ సొల్లిట్ దుర్భాషలాడాడు. 'నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్నావు. ఇది నీ దేశం కాదు. ఒకవేళ ఇక్కడే ఉండి పోదామనుకుంటే ఆ తలపాగాను తీసేయ్' అని టర్బన్ ను చూపిస్తూ సింగ్ కు చెప్పాడు.
వారి మాటలు పట్టించుకోకుండా సింగ్ డ్రైవింగ్ పైనే దృష్టి పెట్టాడు. కొంతసేపటికి టర్బన్ ను తీసివేయాలని సొల్లిట్ పెద్దగా అరిచాడు. అతని భార్య తలపాగాను లాగి అతన్ని తీవ్రంగా కించపరిచారు. సహాయం కోసం డ్రైవర్ అరిచేలోపు దంపతులిద్దరూ దాడి చేశారని ఎన్ టీ న్యూస్ పేర్కొంది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులు పరిస్థితిని అదుపులోపెట్టి దంపతులిద్దరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 'టర్బన్ మా సంప్రదాయానికి గుర్తు, ఆ దంపతులిద్దరూ నా జాతిని అవమానపరిచారు' అని సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.