: హైదరాబాదు సహా ఆరు చోట్ల ఔషధ పరిశోధన సంస్థలు: రాష్ట్రపతి


పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రణబ్ చేసిన ప్రసంగంలో దేశంలోని ప్రధానమైన అంశాలను పేర్కొన్నారు. మరోవైపు సార్వత్రిక సమ్మె నేపథ్యంలో విపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి. అయినా నిరసనల మధ్యనే ప్రసంగం కొనసాగింది. ప్రసంగంలోని ముఖ్య అంశాలు చూస్తే..

ప్రపంచంలో నెలకొన్న ఆర్ధిక మాంద్యం భారత్ పైనా ప్రభావం చూపుతోందన్నారు.  పెట్టుబడులు, ఆర్ధికవృద్ధికి కేంద్రం పలు చర్యలు చేపట్టిందన్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నా.. ఇప్పటికీ సమస్యగానే ఉందని ప్రణబ్ తెలిపారు. అయితే, ద్రవ్యలోటును అధిగమించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ఇక పింఛన్లు, ఇతర రాయితీలన్నీ లబ్దిదారులకు చేరేలా, నగదు బదిలీ పథకం ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

12వ పంచవర్ష ప్రణాళికలో 87 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు. అటు ఇందిరా ఆవాస్ యోజన క్రింద ఇళ్ల నిర్మాణానికి రూ.40 వేల నుంచి రూ.70 వేలకు సాయాన్ని పెంచినట్లు తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు ఆర్టినెన్స్ జారీ చేశామని రాష్ట్రపతి వివరించారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళికలో రూ.1.23 లక్షల కోట్లు కేటాయించామన్నారు.

ఉన్నత విద్యాభివృద్ధికి ప్రత్యేక పథకం ప్రారంభించామనీ, జాతీయ బాలల ఆరోగ్య పథకం కింద 2.70 కోట్ల మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, అసంఘటిత కార్మికుల కోసం జాతీయ ఆరోగ్య బీమా పథకం ప్రారంభించామని పేర్కొన్నారు.  దేశ ఆర్థికాభివృద్ధి మందగమనంలో ఉందన్న ఆయన, దేశంలో ఆహారధాన్యాల కొరత లేదని అన్నారు. ఆహార భ్రధత బిల్లుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా వ్యవసాయ ఉత్పత్తిలో ప్రగతి సాధిస్తున్నామని చెప్పారు.

జేఎన్ఎన్ యూఆర్ఎం పథకాన్ని 2014 మార్చి వరకు పొడిగించామన్నారు. 
గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.5వేల కోట్లు కేటాయింపు జరిగిందన్నారు. దేశ సరిహద్ధు భ్రధతకు సైన్యం సన్నద్ధంగా ఉందన్నారు. వీటితోపాటు దేశవ్యాప్తంగా హైదరాబాదు సహా ఆరు చోట్ల ఔషధ పరిశోధన సంస్థలు నెలకొల్పనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు. ఉత్పాదక రంగంలో 10 కోట్ల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేబడుతుందన్నారు. 

  • Loading...

More Telugu News