: కిరణ్ వ్యాఖ్యలపై ఆమోస్ ఆగ్రహం
తెలంగాణ ఇవ్వడం సబబు కాదని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అన్నట్టు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెబుతుండడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత కేఆర్ ఆమోస్ మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు ఇందిరా గాంధీ అడ్డుపడ్డారన్నది అసత్యమని అన్నారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, అప్పట్లో తెలంగాణ విషయమై ఐక్యరాజ్యసమితిలో నిజాం నవాబు పిటిషన్ వేశారని, ఆ పిటిషన్ పెండింగ్ లో ఉన్నందునే ఇందిరా గాంధీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించలేకపోయారని ఆమోస్ చెప్పుకొచ్చారు. సీమాంధ్ర నేతలు ఆదాయ వనరులు, నీటివనరుల పేరిట తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారంతో సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు.