: విదేశీ పెట్టుబడిదారులకు మన్మోహన్ సలాం
అనుకున్నదంతా అయింది. అచ్చమైన ఆర్థికవేత్తలు ప్రధాని మన్మోహన్, ఆర్థిక మంత్రి చిదంబరం దేశీ మార్కెట్ ను విదేశీయులకు అప్పగించేందుకు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12 రంగాలలో విదేశీయులు నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా మార్గం మరింత సుగమం చేశారు. ఈ సందట్లో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందంటూ రక్షణ మంత్రి ఆంటోనీ ఆందోళన వ్యక్తం చేసినా ప్రధాని, చిదంబరం పట్టించుకోలేదు. నిన్న మంత్రివర్గ సహచరులతో ప్రధాని నిర్వహించిన భేటీలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు కచ్చితంగా దేశీ మార్కెట్లో విదేశీయుల ఆధిపత్యానికి దారితీస్తాయని అంటున్నారు.
టెలికాం రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి ఇప్పటి వరకూ 74 శాతంగా ఉంది. దానిని 100 శాతం చేశారు. ఇప్పటివరకు వొడాఫోన్ ఇండియాలో వొడాఫోన్ కు గరిష్ఠ పరిమితి 74 శాతం వరకు వాటా ఉంది. మిగతా 26 శాతం ఎస్సార్ రుయాల చేతిలో ఉంది. పరిమితి పెంచడం వల్ల వొడాఫోన్ 100 శాతం వాటా కొనుగోలుకు వీలు కలుగుతుంది. ఇలా మరే టెలికాం కంపెనీనైనా విదేశీ కంపెనీ గంపగుత్తగా సొంతం చేసుకోవచ్చు. ఒక టెలికాం కంపెనీ పూర్తిగా విదేశీయుల చేతిలో ఉంటే సమాచార భద్రత, గోప్యత ప్రశ్నార్థకమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలే అమెరికా అంతర్జాల గూఢచర్యానికి పాల్పడుతున్న విషయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. రక్షణ రంగంలో ఎఫ్ డీఐ పరిమితి 26 శాతంగా ఉంది. అవసరమైన సందర్భాల్లో ఇంతకంటే ఎక్కువే ఎఫ్ డీఐని అనుమతించాలని నిర్ణయించారు. బీమా రంగంలో 49 శాతం చేశారు. అదీ ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా పెట్టేయవచ్చు. సింగిల్ బ్రాండ్ రిటైల్ లో, కమోడీటీ, విద్యుత్, స్టాక్ ఎక్సేంజ్ లలో ప్రభుత్వ అనుమతి లేకుండా 49 శాతం, అనుమతితో 100 శాతం పెట్టుబడులు పెట్టవచ్చు.
నాడు మహాత్మాగాంధీ విదేశీ వస్తు బహిష్కరణ పిలుపుతో పరాయి పాలనపై పోరు సాగించి భారతావనికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించారు. స్వతంత్ర పాలనకు అవకాశం కల్పించారు. నేడు విదేశీ పెట్టుబడులే భారతీయులకు పిడికెడు మెతుకులకు ఆధారాలంటూ నాటి తెల్లదొరల వారసులు మార్కెట్ పై గుత్తాధిపత్యం వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తత్ఫలితం.. కిలో కూరగాయలు 100 రూపాయలు.. నూనె, పప్పు 100 రూపాయలు. సంస్కరణల మోజులో స్వశక్తిని నిర్వీర్యం చేస్తూ పోతున్నందువల్లే ఈ చేదు ఫలితాలన్నది కాదనలేని నిజం.