: మన పొట్టతోనే బరువు నియంత్రణ చేయొచ్చు
ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపించే సమస్య అధిక బరువు... మరోరకంగా చెప్పాలంటే స్థూలకాయం. ఈ స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతుంటారు. వ్యాయామాలు చేయడం వంటి వాటితోబాటు ఆహారంలో నియమాలను పాటించడం వంటివి కూడా చేస్తుంటారు. అయితే మన పొట్టతోనే మన బరువును నియంత్రించుకోవచ్చని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. మన పొట్టలో రెండు రకాల హార్మోన్ల మోతాదును పెంచడం ద్వారా మన ఊబకాయాన్ని నియంత్రించుకోవచ్చని ఈ పరిశోధనలో తేలింది.
ఆష్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన గార్వెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలపై ఒక పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనలో ఎలుకల్లోకి పీవైవై3`36, పీపీ అనే రెండు రకాల హార్మోన్లను పంపించారు. తర్వాత వాటిని పరిశీలించినప్పుడు ఎలుకలు అంతకుముందుకన్నా తక్కువగా తింటున్నాయని, వాటిలో కొవ్వు కూడా తక్కువగా పేరుకుంటోందని, ఇన్సులిన్ నిరోధకత (షుగరుకు ముందు కనిపించే లక్షణం) వాటికి అలవడలేదని తేలింది.
సాధారణంగా మనం ఆహారం తినే సమయంలో మన పొట్ట నిండినట్టు అనిపించగానే ఆ సందేశాన్ని పీవైవై3-36, పీపీ అనే హార్మోన్లు మన మెదడుకు అందజేస్తుంటాయి. దీంతో మనం తినడాన్ని ఆపేస్తాం. ఇప్పుడు ఈ హార్మోన్ల ఆధారంగానే స్థూలకాయానికి మందులను తయారు చేయడానికి కంపెనీలు ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించేశాయి. అయితే ఈ హార్మోన్ల ప్రభావం అణుస్థాయిలో మన మెదడుపై ఎలా ఉంటుంది? అనే విషయం ఈ పరిశోధన ద్వారా తొలిసారిగా తెలిసింది.