: ఒకే ఇంట్లో ఉన్నా....
ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా కుటుంబ సభ్యులంతా కలిసి గడిపే సమయం తగ్గుతూ వస్తోందట. పాత కాలంలో సాయంత్రాలు అయ్యేసరికి బయటికి వెళ్లిన వారు అందరూ ఇల్లు చేరేవారు. దీంతో రాత్రికి అందరూ కలిసి ఆనందంగా హాయిగా భోజనాలు చేసేవారు. అయితే క్రమేపీ ఇలా అందరూ కలిసి గడిపే సమయం తగ్గుతూ వస్తోందని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. కుటుంబంలోని సభ్యులంతా కలిసి గడిపే సమయం తగ్గిపోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
బ్రిటన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆధునిక జీవన విధానం వల్ల కుటుంబంలోని సభ్యులు తీరిక లేని పనుల కారణంగా తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఉంటున్న సమయం వారంలో కేవలం ఎనిమిది గంటలే అని తేలింది. శని, ఆదివారాల్లో మినహాయిస్తే మిగిలిన రోజుల్లో రోజుకు సరాసరి 36 నిమిషాలు మాత్రమే కుటుంబంలోని సభ్యులంతా పూర్తిస్థాయి ఆనందంగా కలిసి గడుపుతున్నారని, శని, ఆదివారాల్లో మాత్రం కొంత వరకూ తమ విలువైన సమయాన్ని కుటుంబంకోసం కేటాయిస్తున్నారని, ఈ రెండురోజుల్లో గం 2.20 నిమిషాల పాటు కుటుంబంలోని అందరూ కలిసి గడుపుతున్నట్టు, ఆత్మీయతను పంచుకుంటున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. తల్లిదండ్రులు ఎక్కువ గంటల పాటు పనిచేయడం, క్లబ్బులకు వెళ్లడం వంటి కార్యక్రమాల వల్లే కుటుంబంకోసం కేటాయించే సమయం తగ్గిపోయిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే కొద్దిపాటి సమయంలో కూడా ఎక్కువమంది మౌనంగా టీవీలు చూడటానికే పరిమితమవుతున్నారని, అమ్మమ్మ, తాతయ్యల ఆత్మీయతలకు కూడా చిన్న పిల్లలు నోచుకోవడం లేదని, ఏడాదికి ఆరుసార్లు మాత్రమే మనవలను, మనవరాళ్లను తాతయ్యలు, బామ్మలు కలుసుకుంటున్నట్టు ఈ సర్వేలో వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.