: అరుణను వెంబడించి అత్యాచారం చేసి, హత్యకు పాల్పడ్డాడు!


కూకట్ పల్లిలో సంచలనం సృష్టించిన అరుణ హత్య కేసు మిస్టరీని కూకట్ పల్లి పోలీసులు చేధించారు. ఆమెను సహోద్యోగి రామకృష్ణ అత్యాచారం చేసి హత్య చేసినట్టు వెల్లడించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని గుత్తికొండకు చెందిన అరుణ భర్తతో కలిసి గాయత్రీనగర్ లో కాపురముంటోంది. భర్త ఫార్మా కంపెనీలో చేస్తుండగా, ఆమె ఇంటికి దగ్గర్లోని బుక్ బైండింగ్ కంపెనీలో పనిచేసేది. గతేడాది నవంబర్ 5న ఆమె లంచ్ కి వెళ్లి తిరిగి కంపెనీకి రాలేదు.

ఎప్పుడూ అరగంట వ్యవధిలోనే ఇల్లు చేరే అరుణ ఎంతకీ తిరిగి రాకపోవడంతో, పిలవడానికి ఆమె ఇంటికెళ్లాడు సహోద్యోగి. బయటినుంచి పిలిచినా స్పందన లేకపోవడంతో తలుపు తోసుకుని ఇంటిలోపలికి తొంగి చూశాడు. మెడ, కాళ్లు, చేతులు, వైర్లతో కట్టి బట్టలులేని స్థితిలో అరుణ విగతజీవిగా పడి ఉండడంతో షాక్ కు గురయ్యాడు. వెంటనే అతను కంపెనీకి సమాచారమందించాడు. వారు పోలీసులకు సమాచారమందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమె మృతి చెందినట్టు నిర్ధారించుకున్నారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించి పరిశీలించగా స్నిఫర్ డాగ్ ఘటన జరిగిన స్థలం నుంచి బుక్ బైండింగ్ కంపెనీకి, అక్కడ్నుంచి అదే కంపెనీకి చెందిన మరో బ్రాంచీకి వెళ్లి ఆగిపోయింది. దీంతో లంచ్ కు ఆమె రావడం చూసి, ఆమెను వెంబడించిన సహోద్యోగే ఈ ఘాతకానికి పాల్పడి కంపెనీకి వెళ్లిపోయి ఉంటాడని నిర్ధారించుకున్నారు పోలీసులు.

అనంతరం ఆమె మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించగా ఆమె అత్యాచారానికి గురైనట్టు రిపోర్టులో తేలింది. పెనుగులాటలో నిందితుడికి సంబంధించిన నమూనాల ద్వారా డీఎన్ఏ సేకరించిన పోలీసులు ఆ బుక్ బైండింగ్ కంపెనీలో పనిచేసిన, చేస్తున్న వారి డీఎన్ఏ నమూనాతో సరి పోల్చారు. దీంతో రామకృష్ణ డీఎన్ఏ సరిపోలడంతో అతన్ని రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News