: సఫారీ గడ్డపై సచిన్ సెంచరీ బాదాలి: గంగూలీ
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ దక్షిణాఫ్రికా టూర్లో సెంచరీ బాదాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆకాంక్షిస్తున్నాడు. తద్వారా టెస్టు క్రికెట్ నుంచి సగౌరవంగా రిటైర్మెంట్ ప్రకటించాలని సూచించాడు. కోల్ కతాలో నేడు మీడియాతో ముచ్చటిస్తూ, అపారమైన క్రికెట్ ఆడిన సచిన్ కు 200వ టెస్టు పెద్ద విషయం కాదని చెబుతూ, పరుగులు సాధించడం, ఫామ్ లో ఉండడమే ముఖ్యమని అన్నాడు. లారావంటి ఆటగాళ్ళతో తాను ఆడానని, వారందరిలోకెల్లా సచినే అత్యుత్తమం అని పేర్కొన్నాడు. సచిన్ రికార్డు స్థాయిలో 200వ టెస్టు ఆడడం కన్నా రాబోయే దక్షిణాఫ్రికా టూర్లో సెంచరీ చేస్తేనే ఎక్కువ సంతోషిస్తానని దాదా చెప్పుకొచ్చాడు. టీ20, వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ ఇప్పటివరకు 198 టెస్టులాడాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో రెండో టెస్టు ద్వారా '200' మైలురాయిని అందుకుంటాడు.