: సఫారీ అధ్యక్షుడిని అబ్బురపరిచిన భారత చెస్ ప్లేయర్
భారత చదరంగ క్రీడాకారుడు అభిజిత్ గుప్తాపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ప్రశంసల జల్లు కురిపించారు. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన కామన్వెల్త్ చెస్ చాంపియన్ షిప్ లో గుప్తా టైటిల్ కైవసం చేసుకున్నాడు. బహుమతి ప్రదానోత్సవానికి విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జుమా.. గుప్తాకు పసిడి పతకం అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 23 ఏళ్ళకే అంతర్జాతీయస్థాయిలో 20 టైటిళ్ళు ఖాతాలో వేసుకున్నాడని తెలిసి గుప్తాను ప్రశంసించకుండా ఉండలేకపోయారు జుమా. అద్భుత క్రీడాకారుడివంటూ ఇండియన్ స్టార్ భుజం తట్టారు.
కాగా, తాను నెల్సన్ మండేలాతో కలిసి రాబెన్ దీవిలో బందీగా ఉండగా చెస్ నేర్చుకున్నానని జుమా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జాతివివక్షపై పోరాడినందుకు తామిద్దరినీ శ్వేత జాతి ప్రభుత్వం జైల్లో ఉంచిందని, అప్పుడు తమకు చదరంగమే కాలక్షేపమని ఆయన చెప్పారు.