: ఏ గ్రామం చూసినా ఏమున్నది గర్వకారణం!


'గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు' అంటూ నేతలు ఎన్నికల సమయాల్లో ఊదరగొడుతుంటారు. కానీ 'ఏ గ్రామం చూసినా ఏమున్నది గర్వకారణం?' అనేంతగా మారిపోయాయి గ్రామాల పరిస్థితులు. సరైన మౌలిక వసతుల కల్పన మాటను నేతలు ఏనాడో మరిచారు. ఓట్ల కోసమే గ్రామాలు తప్ప, అభివృద్ధికి కాదని అభిప్రాయపడుతున్నారు పలు గ్రామాల ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామాన్ని కదిపినా ఇలాంటి అభిప్రాయమే వినబడుతుంది. నేతలకు, అధికారులకు నగరాలు తప్ప.. గ్రామాలు, అక్కడి ప్రజలు కనిపించరని వాపోతున్నారు.

వ్యవసాయాన్ని నేతలు నిర్లక్ష్యం చేయడంతో ప్రజలంతా వలసల బాటపడుతున్నారని మండిపడుతున్నారు. సౌకర్యాల కల్పన మాట ప్రభుత్వం ఎప్పుడో విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా, పట్టణాల ప్రజలకు 24 గంటలూ విద్యుత్తు సరఫరా, అత్యవసర సేవలు అందుబాటులో ఉంచే ప్రభుత్వాలు, అధికారులు.. గ్రామాల ప్రజలను ఓటు బ్యాంకుగా తప్ప మనుషులుగా గుర్తించడం లేదని అభిప్రాయపడుతున్నారు. కనీసావసరాలను కూడా తీర్చేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. విద్యాసంస్థలు, సీట్లు వారికి అనుకూలురికే తప్ప మిగిలిన వారికి కాదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. పల్లెల నుంచి మెడిసిన్ చేస్తున్నవారెందరంటూ లెక్క అడుగుతున్నారు.

విద్యను, ఉద్యోగాలను కేవలం డబ్బున్న వారికే అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వ పక్షపాత ధోరణిని ఎండగడుతున్నారు. గ్రామాల్లో కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించడం లేదని అంటున్నారు. ఎన్నికలను సంపాదనకు మార్గాలుగా మార్చేశారని, రాజకీయాలు ప్రజలకి సేవ చేసేందుకు కాదని ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస అవసరాలు తీరని నేపథ్యంలో, ప్రభుత్వ ఎన్నికలను బహిష్కరించండంటూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో యువతరం పిలుపునిస్తోంది.

  • Loading...

More Telugu News