: ఎంబీబీఎస్ సీటు.. 6 కోట్లా.. వామ్మో?
వైద్య కళాశాలలు సీట్లను ఇష్టారీతిన అమ్మేసుకుంటున్నాయి. సామాన్యుల 'డాక్టర్' కలలను కల్లలు చేస్తున్నాయి. పుదుచ్చేరిలోని మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 2007-08లో ఎంబీబీఎస్ లో ప్రవేశాల కోసం ఒక్కో విద్యార్థి నుంచి కేపిటేషన్ ఫీజు రూపేణా 5.60కోట్ల రూపాయలను వసూలు చేసిందని సీబీఐ విచారణలో వెలుగు చూసింది. ఇలా 73 మంది విద్యార్థుల నుంచి కోట్లు కొల్లగొట్టింది. అంతేకాదు, నిబంధనలకు విరుద్ధంగా సీట్లను 100 నుంచి 150కు పెంచుకున్నట్లు బయటపడింది. తనిఖీల సమయంలో తూతూ మంత్రంగా అధ్యాపకులను చూపించి సీట్లను పెంచుకుందని తేలింది. దీనిపై సీబీఐ.. మానవ వనరుల అభివృద్ధి శాఖకు నివేదిక సమర్పించింది. 2008లో మానవ వనరుల శాఖ మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించింది. తాజా సీబీఐ నివేదిక ఆధారంగా డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయడం సహా పలు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం.