: నిత్య సంతోషిగా బతకాలంటే...
కొందరిని చూస్తే ఎప్పుడూ సంతోషంగా ఉంటుంటారు... మరికొందరు ఎప్పుడు చూసినా ప్రపంచంలోని సమస్యలన్నీ తమకే ఉన్నట్టు, ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు కనిపిస్తుంటారు. అయితే మనసులో ఏదో ఉంచుకుని మధనపడేవారితో పోల్చుకుంటే ఏదీ దాచుకోకుండా అన్ని విషయాలను వెల్లడించే వారే అధికంగా సంతోషంగా కనిపిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్వర్తనుల కంటే బహిర్వర్తనులు అధిక సంతోషంగా ఉంటారని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో వెల్లడైంది.
కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన నాడీ శాస్త్రవేత్తలు సంతోషానికి సంబంధించి నిర్వహించిన పరిశోధనల్లో అంతర్వర్తనుల కంటే బహిర్వర్తనులు ఎక్కువగా సంతోషంగా ఉంటారని తేలింది. ఇందుకు కారణం వారి మెదడులో విడుదలయ్యే రసాయనాలేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతిఫలాల విషయంలో మన మెదళ్లు విభిన్నంగా ప్రతిస్పందిస్తుంటాయని, తాము నిర్వహించిన పరిశోధనలో కొంతమంది మెదళ్లలో న్యూరోట్రాన్స్‌మిటర్ డోపమైన్‌ను ఎక్కువగా విడుదల చేయడం వల్ల వారిలో ఉద్వేగం అధికంగా ఉంటుందని పరిశోధకులు రిచర్డ్ డెప్యూ పేర్కొన్నారు. ఆహారం, శృంగారం, సామాజిక పరిచయాలు వంటి వాటితోబాటు ధనం, డిగ్రీ అందుకోవడం వంటి ప్రతిఫలాలు మెదడులో డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తాయని డెప్యూ వివరించారు. బహిర్వర్తనుల్లో ప్రతిఫలం దిశగా ఈ డోపమైన్ ప్రతిస్పందన అధికంగా ఉండటం వల్ల మరింత బలమైన సానుకూల ఉద్వేగాలు తరచుగా వారిలో తలెత్తుతాయని, డోపమైన్ ప్రతిఫలానికి సంబంధించిన జ్ఞాపకశక్తి పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటుందని, బహిర్వర్తనుల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందని డెప్యూ వివరించారు. ప్రతిఫలంతో అధిక సంబంధం కలిగి ఉండడం వల్లనే అంతర్వర్తనులతో పోల్చుకుంటే బహిర్వర్తనులు అధిక సంతోషంగా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.