: జాబిల్లిపై జాతీయ పార్కు!
అమెరికా ప్రభుత్వం ఒక జాతీయ పార్కు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అయితే ఇక్కడా అక్కడా కాదు... అది ఏకంగా చంద్రుడిపై... చంద్రుడిపై ఒక జాతీయ పార్కు ఏర్పాటు చేయాలని, ఈ మేరకు ఒక ప్రత్యేక బిల్లు చట్టసభలో ప్రవేశపెట్టబడింది కూడా.
అమెరికా కాంగ్రెస్లో 'అపోలో లూనార్ ల్యాండింగ్ లెగసీ' అనే పేరుతో ఒక చట్టం ప్రవేశపెట్టబడింది. ఈ చట్టంలోని వివరాలేమంటే చంద్రుడిపై ఒక జాతీయ పార్కును ఏర్పాటు చేయాలి. ఈ జాతీయ పార్కు ద్వారా అపోలో ల్యాండింగ్ ప్రదేశాలను పరిరక్షించడానికి వీలవుతుందని సభ్యులు వివరిస్తున్నారు. దీన్ని గురించి శాస్త్ర, అంతరిక్ష, సాంకేతిక కమిటీతోబాటు సహజవనరులపై ఏర్పాటైన సభా కమిటీకి కూడా నివేదించారు. 1969 నుండి 1972 మధ్య కాలంలో అపోలో చేపట్టిన జాబిల్లి యాత్రలు అమెరికా సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని ఈ బిల్లులో పేర్కొనబడింది. అపోలో లూనార్ ల్యాండింగ్ సైట్స్ నేషనల్ హిస్టారికల్ పార్కు ద్వారా అపోలో ల్యాండింగ్ ప్రదేశాలను పరిరక్షించడానికి వీలవుతుందని సభ్యులు ఈ బిల్లులో వివరించారు.