: సంతాన సాఫల్యతకు సంగీతం తోడు!
శిశువులకు, పశువులకు, పాములకు ఇలా అందరికీ ఆనందాన్ని కలిగించేది సంగీతం. ఇలాంటి సంగీతంతో రాళ్లు కరిగించవచ్చని, మేఘాలను వర్షింపజేయవచ్చని మనం చదువుకున్నాం. అయితే, అదే సంగీతంతో ఫలదీకరణ సామర్ధ్యాన్ని కూడా పెంచవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. సంగీతాన్ని వింటే సంతాన సాఫల్య అవకాశాలు మెరుగుపడతాయని వారు చెబుతున్నారు.
బార్సిలోనాలోని మార్కస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్టిలిటీ క్లినిక్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఐవీఎఫ్ పిండాలకు సంగీతాన్ని వినిపించి వాటి ఫలదీకరణ సామర్ధ్యాన్ని గమనించారు. సంగీత బాణీలను విన్న ఐవీఎఫ్ పిండాలకు ఫలదీకరణ సామర్ధ్యం ఐదు శాతం మేర పెరిగినట్టు వారు ఈ పరిశోధనలో గమనించారు. శాస్త్రవేత్తలు ముందుగా వెయ్యి అండాల్లోకి శుక్రకణాలను చొప్పించి, తర్వాత వాటిని ఇంక్యుబేటర్‌లో ఉంచి, వాటికి ఐపాడ్‌లతో సంగీతాన్ని వినిపించారు. ఇందులో మెటాలికా, నిర్వాణ, మైఖేల్‌జాక్సన్, మడోన్నాలకు చెందిన కొన్ని బాణీలను ఎంపిక చేసి వినిపించారు. వాటితోబాటు బాచ్, వివాల్డి, మొజార్ట్ వంటి సాంప్రదాయ రీతులను కూడా వినిపించారు. ఈ పరిశోధనలో రాక్ సంగీతంలోని హెవీ మెటల్‌తోబాటు ఇతర సంగీత రీతుల ద్వారా ఫలదీకరణ సామర్ధ్యం ఐదు శాతం మేర పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి కారణాలను చెబుతూ ఐవీఎఫ్ పద్ధతిలో తయారైన పిండాలు డిష్‌లోనే ఉంటాయని, సహజసిద్ధంగా ఫలదీకరణ చెందిన పిండాలు మాత్రం ఫెలోఫియన్ నాళాల నుండి ఎగురుకుంటూ, దొర్లుకుంటూ వచ్చి గర్భాశయానికి చేరుతాయని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫలదీకరణ నిపుణుడు డాగన్ వెల్స్ చెబుతున్నారు.