: ఇక్కడే 'పసి'తల్లులు ఎక్కువట!


ఒకవైపు చదువుకు సంబంధించి అన్ని రకాల పరీక్షల్లోనూ అమ్మాయిలు అగ్రస్థానాన్ని ఆక్రమిస్తున్నారు. మరోవైపు ఉద్యోగాల్లో కూడా అమ్మాయిలు మెరుగైన పనితనం కనబరుస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఒకవైపు ఇన్ని రకాలుగా ముందంజలో ఉన్నా అటు పసి వయసులోనే తల్లులు అయ్యే అమ్మాయిలు కూడా అధికసంఖ్యలోనే ఉన్నారట. మనదేశంలో వందల సంవత్సరాల కాలం నాటి బాల్య వివాహాలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. దీంతో పసివయసులోనే తల్లులయ్యే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా విడుదల చేసిన ఒక నివేదికలో స్పష్టం చేసింది.

ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో పదిహేను నుండి పందొమ్మిదేళ్ల వయసుకే తల్లులయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఈ నివేదిక చెబుతోంది. అంతేకాదు పసి వయసులోనే గర్భం ధరించడం వల్ల ప్రసవ సమయంలో మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని నివేదికలో తేలింది. ఆడపిల్ల అనే వివక్ష వల్ల, సరైన విద్య లేకపోవడం, సమాజంలోని మూఢ నమ్మకాలు వంటివి బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నాయని, దీనికితోడు పసితనంలోనే పెళ్లి కావడం వల్ల పోషకాహారలేమి, అవగాహనా కొరత కారణంగా పసితనంలోనే గర్భం ధరించి, ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ విషయాలను గమనించిన ఐరాస ఈ ఏడాదినుండి ఇలాంటి వారి ఆరోగ్యం పట్ల దృష్టి సారించనుంది. పసితనంలోనే తల్లులయ్యేవారి ఆరోగ్యం కోసం, తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం ఈ ఏడాది ప్రత్యేక శ్రద్ధతో కృషి చేయాలని ఐరాస పిలుపునిచ్చింది. ఇందుకోసం బాల్య వివాహాలను అరికట్టడం, పసితనంలోనే తల్లులైన వారికి అవగాహన కల్పించి ప్రసవ మరణాలు తగ్గేలా చైతన్యం తీసుకురావడం వంటి అంశాలతో కూడిన ఒక కార్యాచరణను ప్రకటించింది.

  • Loading...

More Telugu News