: మా పెట్టుబడులు కావాలంటే భారత్ మారాలి: అమెరికా ప్రతినిధులు
అమెరికా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో బారులు తీరాలంటే భారత్ తన విధానాలను సమీక్షించుకోవాలని అమెరికా నేతలు అంటున్నారు. ఇంతకుముందు కంటే ఇరుదేశాల మధ్య తాజా వ్యాపార సంబంధాలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. అమెరికా వాణిజ్య సంఘం ప్రతినిధులు మైక్ ఫ్రోమాన్, డేవిడ్ కోటేలు మీడియాతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అమెరికా-భారత్ ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం చైనాతో పోల్చితే దరిదాపుల్లో లేదని ఫ్రోమాన్ పేర్కొన్నారు.
భారత్ లో సంస్కరణలకు ఆర్ధిక మంత్రి చిదంబరం, వాణిజ్యం-పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా కట్టుబడి ఉన్నారని, కానీ, ఎందుకో అవి కార్యరూపం దాల్చడంలేదని ఫ్రోమాన్, కోటే అన్నారు. ప్రస్తుతం భారత ఆర్ధికమంత్రి పి.చిదంబరం అమెరికాలో పర్యటిస్తున్న తరుణంలో అమెరికా వాణిజ్య సంఘం ప్రతినిధుల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.