: రాష్ట్ర విభజనను అడ్డుకునే బ్రహ్మాస్త్రం ఉంది: లగడపాటి


రాష్ట్ర విభజనను అడ్డుకునే బ్రహ్మాస్త్రం తెలుగుతల్లి చేతిలో ఉందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన నేడు హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే బ్రహ్మాస్త్రం తెలుగుతల్లి చెంతనుందని, దాన్ని తమ స్టార్ బ్యాట్స్ మెన్ సక్రమంగా ఉపయోగించి ఫలితాలు రాబడతారని చెప్పారు. ఇక రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ అవసరం అంటూ, కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా దానికో విధానముంటుందన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి ప్రాంతాలను విడదీయడం వేర్పాటువాదుల పని అని, కాంగ్రెస్ పార్టీ ఆ పనిచేయదని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ బికారి అవుతుందని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానం ద్వారానే ఏర్పాటయ్యాయని.. తెలంగాణకు సంబంధించి డిసెంబర్ 9 ప్రకటన కూడా అసెంబ్లీ తీర్మానంతో ముడిపడి ఉందని లగడపాటి అన్నారు. అప్పట్లో రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానానికి కేసీఆర్ అంగీకరించలేదని ఆయన వెల్లడించారు.

కాగా, 2004లో ప్రజలు సమైక్యానికే ఓటేశారని, 2009లో తెలంగాణకు అనుకూలమని చెప్పకపోయినా ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే వచ్చే ఎన్నికల్లోనూ 30 సీట్లు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిన్న జరిగిన కోర్ కమిటీ భేటీ అనంతరం రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్న నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News