: ఆసీస్ టార్గెట్ 311
యాషెస్ తొలి టెస్టు రసవత్తరంగా మారింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఆసీస్ కు 311 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఆటకు మరోరోజు మిగిలి ఉన్న నేపథ్యంలో కంగారూలు వికెట్ నష్టపోకుండా 81 పరుగులతో ఆడుతున్నారు. ఓవర్ నైట్ స్కోరు 326/6తో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య ఇంగ్లండ్ మరో 49 పరుగులు జోడించి ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టులో బెల్ 109, బ్రాడ్ 65 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో సిడిల్, స్టార్క్ చెరో మూడు వికెట్లు తీయగా.. కొత్తముఖం అగర్, ప్యాటిన్సన్ రెండేసి వికెట్లు సాధించారు. ఇక ఇంగ్లండ్ జట్టు లంచ్ కు ముందు తన ఇన్నింగ్స్ ముగించగా.. 311 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు బరిలో దిగిన ఆసీస్ ఓపెనర్లు వాట్సన్ (45 బ్యాటింగ్), రోజర్స్ (36 బ్యాటింగ్) ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 215 పరుగులు చేయగా, ఆసీస్ 280 పరుగులు చేసింది.