: ఆధార్ సిబ్బంది ఆమెను చంపేశారు!
ఆధార్ గుర్తింపు కోసం వచ్చిన వృద్దురాలు సిబ్బంది నిర్వాకంతో మృతి చెందింది. ప్రకాశం జిల్లా చీరాల బోస్ నగర్ కు చెందిన గుంటుపల్లి రామతీర్ధమ్మ(75) స్థానిక ఎన్ఆర్పీఎం పాఠశాలకు ఆధార్ దరఖాస్తు కోసం వచ్చింది. ప్రతి శనివారం ఇక్కడ ఆధార్ అప్లికేషన్లు ఇస్తుంటారు. దాంతో, ఇక్కడికి భారీగా జనం వచ్చారు. తొలుత మేడ మీద దరఖాస్తులిస్తామన్న సిబ్బంది తరువాత కింద ఇస్తామన్నారు. ఇలా 'మేడమీద కాసేపు, కింద కాసేపు' అంటూ పలుమార్లు దరఖాస్తు పంపిణీ స్థానాన్ని మార్చడంతో ఆ వృద్దురాలు మేడమీదికి, కిందికి తిరగాల్సి వచ్చింది. దీంతో, తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఆధార్ కేంద్రం వద్దే తుది శ్వాస విడిచింది. ఆధార్ సిబ్బంది తీరుతోనే ఆమె మృతి చెందిందని, ఆధార్ సిబ్బందే హత్య చేశారని స్థానికులు మండిపడుతున్నారు.